ఒకే అర్థంతో ఉన్నప్పటికీ Freedom అనే పదం సామాజిక సందర్భాలలో, Liberty అనే పదం రాజకీయ సందర్భాలలో వాడాలనే అభిప్రాయం ఉంది. Liberty అనే పదం లాటిన్ పదమూలం Liber (స్వేచ్ఛ పరచు) నుండి రావటం వలన పై అభిప్రాయం కలిగి ఉండవచ్చు. కానీ సాధారణంగా ఈ రెండు పదాలు దాదాపు పర్యాయపదాలే. ప్రస్తుతం, ఈ సందర్భంలో, స్వేచ్ఛ అన్నది జాతివిముక్తి కొరకు జరిపే స్వాతంత్ర్య సమరముల దృష్ట్యా కాక మిగిలిన అర్థముల దృష్ట్యా పరిశీలించబడుతుంది.

సాధారణంగా స్వేచ్ఛ అంటే ఎవరైన ఒక పనిని చేయతలచినప్పుడు, అది చెయ్యగలగటం, అని అర్థం చేసుకుంటాము. ఒకరి పని మరొకరి పనులతో కల్పించుకోనంత వరకు సమస్య వుండదు. కానీ మనుషులు సమూహంలో వుంటారు. వారి పరస్పర సంబంధాలలో ఇష్టాఇష్టాలు ఉంటాయి. కనుక వారి ప్రయోజనాలలో స్పర్థలు లేదా వైరములు రావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీన్నిబట్టి, మనిషికి నిరపేక్ష స్వేచ్ఛ ఉండదని తెలుస్తుంది. పై పెచ్చు మానవజీవితం వ్యవస్థాపరమైన జీవితంగా ఉంటుంది. ప్రతివారు ఏదోఒక సంస్థకు చెందినవారుగా ఉంటారు. అ విధంగా వ్యవస్థాపరమైన లక్ష్య సాధనకు ప్రతివారు తమ ప్రవర్తనను నియంత్రణతో మలచుకోవడాన్ని మర్చిపోలేరు. లేదా వదులుకోలేరు. అంతకుమించి, రాజకీయ జీవితం, నియంత్రణతో కూడిన లేదా పరిమితమైన ప్రవర్తనను విధిస్తుంది. ఇతరుల ప్రయోజన దృష్ట్యా వ్యక్తుల కోరికలు లేదా ప్రయోజనాలను మలచుకోవడం ఎలా? ప్రభుత్వం ఏ ప్రయోజనం కొరకు స్థాపించబడిందో, ఆ పరిధి దాటి వెళ్ళకూడదు. అనగా ప్రభుత్వం పరిమితమైనది. అయితే విధి నిర్వహణలో ప్రభుత్వం ఎంతవరకు పరిమితమైనది? ఇచ్చట కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 

వ్యక్తి శ్రేయోవాదుల విపరీత అంత్యముగా, అరాచకవాదులు ప్రజలు తమకు నచ్చిన విధంగా ఉండుటకు, రాజకీయ వ్యవస్థాపనము క్రమేపీ తొలగిపోవాలి అని నమ్ముతారు. ఏ సంస్థ అయినా ప్రత్యేకించి రాజకీయ సంస్థ మానవ మూర్తిత్వ పెరుగుదలను అరికట్టకూడదు. అలా జరుగుటకు అడ్డుతగల కూడదు. అరాచక వాదుల దృష్టిలో ప్రతి సంస్థ వ్యక్తి పెరుగుదలకు అడ్డు నిలుస్తుంది. బకునిన్, క్రొపొట్కిన్  ప్రౌధొన్ ప్రముఖులైన అరాచకవాదులు. అరాచకవాద సారాంశం వ్యక్తి అన్ని సంస్థలకు మించి, అభివృద్ధి చెందాలి లేదా ఉన్నతుడు అవ్వాలి. కానీ అరాచకవాదం ఒక కాల్పనికమైనదిగా చూడవచ్చును. ఎందుకంటే, రాజ్యజోక్యము ఒకొక్కప్పుడు లేదా తరచూ అవసరమనిపిస్తుంది. రాజ్యము ఆవశ్యక క్లేశం దాని జోక్యము ఎంత తక్కువ ఉంటే అంతకుమించి, కానీ రక్షణ ఇవ్వడానికి రాజ్యమే చర్య తీసుకోగలదు. ఈ సంధర్భంలోనే స్వేచ్ఛను గురించి, వ్యక్తి శ్రేయోవాదుల, ఉదార అధికార, సామ్యవాదుల దృష్టి విభిన్నరీతులలో ఉండటం గమనిస్తాము.

★  స్వేచ్ఛ - వ్యక్తి శ్రేయోవాద దృష్టి:

వ్యక్తి శ్రేయోవాద సిద్దాంతం రాజకీయ వ్యవస్థాపన ఒకే ఒక్క లక్ష్యం లేదా ప్రయోజనం వ్యక్తికీ సాధ్యమైనంత స్వేచ్ఛ అన్న ప్రాతిపదికపై ఆధారపడియున్నది. మానవుడు స్వతహాగా తనను తాను మంచిగా ఉండునట్లు చూసుకోగలడు లేదా ప్రవర్తించగలడు. ఇతరులపై సానుభూతి కలిగి ఉంటాడు. మరియు అనుగుణ్యముగా ఉండగలడు. ఒకవేళ మానవుడు తప్పులు చేసినప్పటికీ లేక ఒక్కసారి వివేచన రాహిత్యంతో ఉన్నప్పటికీ అనుభవం తనను వివేకవంతునిగా చేస్తుంది మరియు సంఘజీవిగా మలుస్తుంది. మరోమాటలో చెప్పాలంటే, మానవుడు ఉదారుడు మరియు హేతువాది. కనుక తాను వ్యవస్థాపన చేసిన ఏ ఏర్పాటైనా తను అభివృద్ధి చెందడానికి తోడ్పడేదిగా ఉండాలి. రాజ్యాధికారము మానవుని వ్యక్తిమూర్తిత్వాన్ని రక్షించేదిగా వుండాలి. అయితే రాజ్యము కొన్ని సందర్భాలలో కొందరి సంరక్షణ కోసం ప్రక్కన నిలబడగల్గాలి. అలా ఎప్పుడు వీలుపడుతుందంటే, ప్రస్తుతం అమలులో ఉన్న వస్తు మరియు సేవల పంపిణీ విధానము వలన దెబ్బతిన్న వారి ప్రయోజనాలను కాపాడగల్గినప్పుడు. ఆ విధంగా రాజ్య జోక్యము కూడ అవసరమనిపిస్తుంది. రాజ్యము యొక్క పరిమిత పాత్ర మరియు కొందరి విషయంలో కొన్ని విషయాల గురించి రాజ్య జోక్యము - ఈ రెంటి సమన్వయం సంధిగ్ధంగాను  క్లిష్టంగాను ఉన్నప్పటికీ, ఉదారదృష్టి అనగా ఈరెంటి సమన్వయపరటంలో సమస్యను పరిష్కరించడానికి మంచి మార్గము. ఈ దృష్టినే వ్యక్తి శ్రేయోవాదము లేదా ఉదారవాదం అని కూడా అంటారు. 


★  స్వేచ్ఛ ఉదారవాద దృష్టి:

ఉదారవాదం లాక్ రచనల నుండి పెంపొందింపబడి అధునిక యుగంలో ప్రాముఖ్యత వహించింది. లాక్ ఉదారవాదం, అన్ని రాజకీయ ఏర్పాటులకు ఒకే ఒక లక్ష్యం వ్యక్తి శ్రేయస్సు అన్న వ్యక్తి శ్రేయోవాదంపై ఆధారపడ్డది. మానవుడు హేతువాది మరియు ఉదారవాది‌. మానవుడు అనుభవం ద్వారా అభివృద్ధి చెందుతూ ఉంటాడు. ఆస్తి, మానవమూర్తికి విస్తరణ. తమ జీవితం, స్వేచ్ఛ మరియు ఆస్తిని రక్షించుకొనుటకు మానవుల కృషి ఫలితంగా ఏర్పడిందే రాజ్యము. రాజ్యము లేదా ప్రభుత్వాల ముఖ్యలక్షణం శాంతి భద్రతలను కాపాడటం, ఆ విధంగా రాజ్యము ప్రజల జీవుతము, స్వేచ్ఛ, ఆస్తి, విషయాలలో జోక్యం కలిగించుకోకూడదు. లాక్ ఉదార రాజనీతి, రాజ్యము యొక్క మితిమీరిన లేక ఒత్తిడితో కూడిన అధికారం నుండి వ్యక్తి స్వేచ్ఛ ముఖ్యమని నొక్కి వక్కాణిస్తుంది.

ఆధునిక వ్యక్తి శ్రేయోవాదమును ప్రతిపాదించిన జె.ఎస్. మిల్, మరి కొంచెము ఎక్కువ స్థాయిలో వ్యక్తి స్వేచ్ఛను సమర్థిస్తాడు. వ్యక్తి స్వేచ్ఛ రాజ్యము నుండే కాదు సమాజం నుండి కూడా ఉండాలన్నదే మిల్ యొక్క గట్టి ప్రతిపాదన, ప్రతి వ్యక్తీ ఆలోచించడానికి, అభిప్రాయాలు కలిగి ఉండటానికి, వాటిని వ్యాప్తి చేయడానికి, మరియు మరొకరితో పంచుకోవడానికి వ్యక్తికి స్వేచ్ఛ అవసరం. మరొకరి స్వేచ్ఛ, ప్రయోజనాలకు హానీ కలిగించనంతవరకు ఒక వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలి. ఇంతవరకు లాక్ లాగానే మిల్ కూడా ఉదారవాది. అయితే కమ్యూనిటీకి కొన్ని ప్రయోజనాలు ఆరోగ్యము, విద్య లాంటివి , వుండవని మిల్ గుర్తిస్తాడు. స్త్రీలు మొదలగు కొన్ని వర్గాలను వివక్షత లేదా దోపిడీ నుండి కాపాడవలసి ఉన్నది. కనుక అలాంటి వర్గాలు అభివృద్ధి చెందుటకు రాజ్యము వారిని ఆదుకోవలసి ఉన్నది. మరో మాటలలో చెప్పాలంటే, రాజ్యమునకు కేవలం శాంతి భద్రతలు కాపాడటమే కాకుండా, మరొక ప్రత్యేక పాత్ర కూడా ఉంది. ఆ విధంగా మిల్ ప్రతిపాదించిన వ్యక్తి శ్రేయోవాదము వ్యక్తి స్వేచ్ఛకు, కమ్యూనిటీ లేదా సమాజ ప్రయోజనాలకు లేదా శ్రేయస్సుకు సమన్వయం కుదురుస్తుంది. ఫ్రెంచి ఫిజియోక్రాట్స్ - మాంటెస్కూ, బెన్థామ్, మరియు స్పెన్సర్ ఇలాంటి వ్యక్తి శ్రేయోవాదమును లేదా ఉదారవాదమును ప్రతిపాదించారు.