భారత స్వాతంత్రోద్యమంతో పాటు మొదలై, ప్రత్యేక నినాదంతో స్వాతంత్ర్యానంతరం కూడా కొనసాగి, 1999 లో ఉద్యమ లక్ష్యాన్ని సాధించింది. జార్ఖండ్ ఉద్యమం. బీహార్ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో గల కొన్ని గిరిజన జాతుల నివాస ప్రాంతాల్లో ఈ ఉద్యమం ప్రారంభమైనది. ఈ జార్ఖండ్ ప్రాంతంలో గల ప్రధాన ప్రాచీన జాతులైన ముండాలు, ఓరయోన్లు, సంతాళ్ళు, హోతెగల వారు తమకు ప్రత్యేక గిరిజన రాష్ట్రం కావాలని కోరుతూ ఉద్యమాన్ని లేవనెత్తారు. మైదాన ప్రాంతాల నుంచి వలస వస్తున్న బయటివారి దోపిడి నుంచి రక్షణకు, దళారీలు, వడ్డీ వ్యాపారులు, అటవీ సిబ్బంది అమానుష కార్యకలాపాలకు వ్యతిరేకంగా గిరిజన రాష్ట్రం కావాలని కోరుతూ ఉద్యమాన్ని లేవనెత్తారు. ఈ ఉద్యమం రాజకీయ, ఆర్థిక ఉద్యమంగా కనబడినా, ఇది ఒక సాంఘిక ఉద్యమం. అంటే అణచివేతకు నిరాధారణకు గురైన తమ సంస్కృతిని, జీవన విధానాలను, సంప్రదాయాన్ని పరిరక్షించుకోవడానికి వచ్చిన ఉద్యమంగా దీన్ని అభివర్ణిస్తే దీనిని సాంఘిక ఉద్యమంగా పేర్కొనవచ్చు.

వాస్తవానికి 1928 సంవత్సరంలో ‘ఉన్నతి సమాజ్’ అనే గిరిజన సంస్థ సైమన్ కమీషను ముందు జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బయట పెట్టింది. ఈ ప్రయత్నం విజయవంతం కాకపోవడంతో 1948 లో జైపాల్ సింగ్ జార్ఖండ్ పార్టీని ఏర్పాటుచేశాడు. 1955 - 56 లో రాష్ట్రాల పునర్విభజన కమీషన్ తో జార్ఖండ్ ఏర్పాటు ఆవశ్యకతను చర్చించాడు. ఈ ప్రయత్నం కూడా సఫలీకృతం కాలేదు. వివిధ గిరిజన జాతుల మధ్య భాషాపర ఏకత్వం లేదు కాబట్టి జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు వీలు కాదని కమీషన్ తెలిపింది. కొంతకాలానికి జైపాల్ సింగ్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో చీలికలు వచ్చాయి. దీనితో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) పేరుతో కొత్త రాజకీయ సంస్థ రూపుదిద్దుకుంది. దీనికి కార్మిక నాయకుడు ఎ.కె. రాయ్ నాయకుడు కాగా, సంతాల్ తెగకు చెందిన శిబుసోరెన్, కుర్మీ తెగకు చెందిన మహాతో ధీరజ్ మండక మిగిలిన నాయకులు. వీరు జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర భావనను పునర్ నిర్వచించారు. ఈ ప్రాంతంలో గల వివిధ తెగలు - జాతులే కాక, దోపిడీకి గురైన ఇతర ప్రయోజనాల దృష్ట్యా కూడా జార్ఖండ్ రాష్ట్రం అవసరమని తెలిపారు. దీంతో ఉద్యమానికి తెగలు - జాతులు, కులీలు, వర్గాలు అందరి మద్దతు సమీకృతమైంది. ఈ ఉద్యమ విశ్లేషణకు ముందు ఆ ఉద్యమం గుర్తించిన సాంఘిక సమస్యలను ప్రస్తావించాలి. మౌలికంగా గిరిజనులు భూమితో పరాయికరణ చెందడం, ప్రాంతీయ అభివృద్ధితో సాంఘిక వ్యయాలు అధికం కావటం జరగడంతో వారిలో అలజడి చెలరేగి, సమగ్రత గుర్తింపుల కోసం వారిలో చైతన్యం దశల వారీగా వ్యవస్థీకృతమైంది. సాంఘిక పెత్తందారీ ఆధిపత్యం నుంచి విముక్తికి, సంస్కృతి పరిరక్షణకు, సాంప్రదాయం విలువలు కాపాడుకుంటూ జనజీవన స్రవంతిలో కలవడానికి ఈ ఉద్యమం నడుం కట్టింది. ఈ ఉద్యమం లేవనెత్తిన రెండు ముఖ్య సమస్యలు పరాయికరణ, సాంఘిక వ్యయాలు. 


గిరిజన సమస్యలు - పరాయీకరణ:

జార్ఖండ్ ప్రాంతం ఛోటానాగపూర్, సంతాల్ పరగణా మొదలైన అటవీ భూములతో, ఎత్తైన మైదానాలతో కూడి ఉంది. బ్రిటీషు వారు ప్రవేశపెట్టిన అటవీ విధానాల వల్ల గిరిజనులు అటవీ భూముల నుంచి, అటవీ వనరుల నుంచి దూరమయ్యారు. శతాబ్ధాలుగా అటవీ వనరుల నుంచి దూరమయ్యారు. శతాబ్ధాలుగా అడవులను, కొండలను నమ్ముకున్న గిరిజనులు ఈ క్రొత్త తరహా అటవీ విధానాల వల్ల తమ భూముల నుంచి దూరమై పరాయీకరణకు గురయ్యారు. తమ ప్రాంతంలో తామే పరాయి వ్యక్తులుగా, భూమిపై - భుక్తిపై పరాయి వారుగా భ్రాంతి చెందారు. బ్రిటీషు వారితో మొదలై స్వాతంత్ర్యానంతర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ఆ అటవీ విధానాలలో అటవీ భూములను ప్రజలు చొరబడకుండా రిజర్వ్ చేయడం, కొన్ని భూములపై వ్యక్తిగత ఆస్తి హక్కును ప్రసాదించడం, జాగీర్ దారీ వ్యవస్థ పేరుతో శాశ్వత భూమిశిస్తు పద్ధతిని ప్రవేశపెట్టడం ముఖ్యమైనవి. దీంతో అడవులను నమ్ముకున్న గిరిజనులు భూమి లేని వారుగా మారడం, కొద్దిపాటి భూమి ఉన్నవారు వడ్డీ వ్యాపారులకు, బయటివారికి తాత్కాలిక అవసరాల కోసం కారు చౌకగా భూముల్ని అమ్మివేయడంతో భూమికి దూరమయ్యారు. కొద్దిమంది భూమిని పండించడంలో దెబ్బతిని తీవ్ర ఆర్థిక దోపిడీకి గురై తమ భూకమతాలను చిన్న పెట్టుబడి దారులకు, వడ్డీ వ్యాపారులకు దాఖలు పరచి వ్యవసాయ కూలీలుగా మార్పు చెందారు. తమ బ్రతుకుదెరువు కోసం వలసలు పోయిన వారు కూడా లేకపోలేదు. ఆధునికత పేరుతో తమను కబళించిన ఇతర సంస్కృతుల - సంప్రదాయాల మధ్య తమను తాను పరాయి వారిగా భావించసాగారు. ఈ పరాయీకరణకు తోడు అభివృద్ధి పేరుతో వచ్చిన ఇతర మార్పులు వారిలో ఆందోళనకు తోడయ్యాయి. ప్రత్యేక తెగల రాష్ట్రం ఏర్పాటు ద్వారానే తమ సంస్కృతిని పరిరక్షీంచుకోగలమని భావించారు. నిజానికి గిరిజనుల భూమిని రక్షించే శాసనాలు బ్రిటీషు పాలనలో లేకపోలేదు. 1869 సంవత్సరంలొ ఛోటా నాగపూర్ టెనెన్సీ చట్టం ప్రకారం బయటి వ్యక్తులు గిరిజనుల వద్ద నుంచి భూమి కొనుగోలు చేయడం, గిరిజనుల నుంచి గిరజనేతరులకు భూమి బదిలీ చేయడం నిషేధించబడింది. ఇలాంటి చట్టాలు ఉన్నప్పటికీ గిరిజన భూములు ఏదో ఒక రూపంలో గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్తూనే ఉన్నాయి. వ్యవసాయం మందగించి ప్రతీసారి ప్రత్యామ్నాయంగా గిరిజనులు అటవీ వనరులను ఉపయోగించుకొనేవారు. పటిష్టమైన అటవీ చట్టాల పేరుతో గిరిజనులను అడ్డగించడంతో ఈ ప్రత్యామ్నాయం కూడా చేజారిపోయేది. ఈ పరిస్థితిని అడ్డుకోవడానికి 18, 19 శతాబ్ధాల్లో కనీసం 3, 4 సార్లు గిరిజన తిరుగుబాట్లు జరిగాయి. వీటిలో 1785 లో వచ్చిన తిలక్ మంఘ తిరుగుబాటు, 1799 - 1800 లో వచ్చిన భుమ్జి తిరుగుబాటు, 1830 లో వచ్చిన కోల్ తిరుగుబాటు 1855 లో వచ్చిన సంతాల్ తిరుగుబాటు, 1895 - 1900 మధ్య వచ్చిన బిర్సాముండా తిరుగుబాటు ముఖ్యమైనవి. ఈ తిరుగుబాట్లు గిరిజనులలో విశ్వాసాన్ని, సమగ్రతను పెంచాయి.


జార్ఖండ్ చైతన్యం - వివిధ దశలు:

జార్ఖండ్ చైతన్యం ఒక సాంఘిక ఉద్యమంగా పరిణితి చెందడానికి కనీసం 15 సంవత్సరాల కాలం పట్టింది. ఈ చైతన్యం పరిణామ క్రమంలో అభివృద్ధి చెందుతూ వచ్చింది. వీటిలో మొదటి దశగా వివిధ గిరిజన తెగలు - జాతులు ప్రత్యేకంగా దోపిడీని గుర్తించి దోపిడీదారులకు వ్యతిరేకంగా పోరాడటం (1830 లో హో తెగవారు, 1855 లో సంతాళ్ళు, 1900 లో ముండాలు)
 ఈ పోరాటాలు ప్రతి జాతి - తెగలోనూ బ్రిటిష్ విధానాలు - దోపిడీల పట్ల అవగాహన కల్పించాయి. రెండో దశలో గిరిజనులలో సమైక్యత కన్పిస్తుంది. ఇతర జాతుల తెగల సమస్యల పట్ల సానుభూతితో గిరిజనులలో సమైక్యత ఈ దశలో కన్పిస్తుంది. 1928లో సైమన్ కమీషన్ ముందు సమర్పించిన జార్ఖండ్ పార్టీ నిర్మాణాల్లో ఇది ప్రస్ఫుటమవుతుంది. మూడో దశలో జార్ఖండ్ గుర్తింపు విస్తృతమై అది తెగల చైతన్యం నుంచి వర్గ చైతన్యంగా మారడం చూడవచ్చు. ఈ చైతన్యం జైపాల్ సింగ్ నాయకత్వంలోనే ప్రారంభమైనప్పటికీ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో ఆ తర్వాత కాలంలో ఏర్పడింది. జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకత్వంలో గిరిజన చైతన్యం కార్మిక తెగల, వ్యవసాయ కూలీల చైతన్యంగా మారింది. దీనినే వర్గ చైతన్యంగా పేర్కొనవచ్చు. ఇదే చైతన్యం తరువాత కాలంలో ప్రాంతీయత విస్తరించిన జాతి చైతన్యంగా మారింది. ఈ మద్ధతుతో ప్రత్యేక రాష్ట్ర సాధన సులభతరమయింది. జార్ఖండ్ రాష్ట్ర సాధన పోరాటానికి వివిధ వర్గాల ప్రజలు ఈ దశలో మానసికంగా దృఢంగా తయారయ్యారు.

జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చాలా కాలంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వేచి చూచే ధోరణి అవలంభించింది. ఈ ఉద్యమం తీవ్రతరం కావడంతో 1995 లో జార్ఖండ్ స్వయం ప్రతిపత్తి కౌన్సిల్ ను ఏర్పాటు చేసింది. ఈ లోగా జార్ఖండ్ ఉద్యమంలో చీలికలు, జాతీయ రాజకీయ రంగంలో సంక్షోభం వచ్చాయి. చాలాకాలం బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక జార్ఖండ్ నిర్మాణానికి సమ్మతించలేదు. జార్ఖండ్ ఉద్యమ నాయకులు అవిశ్వాస తీర్మానం విషయలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు‌. అయినప్పటికీ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నశించలేదు. దీన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణతో జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పరచింది. ఈ విధంగా జార్ఖండ్ రాష్ట్రం నవంబర్ 15, 2000 తేదీ నుండి పూర్తి స్థాయి రాష్ట్రంగా మారింది.