భారతదేశంలో దాదాపు 70 శాతం ప్రజలు గ్రామాలలో నివశిస్తూ ఉండటం వల్ల ఈ దేశాన్ని గ్రామాలతో కూడిన దేశంగా వర్ణిస్తారు. భారత సామాజిక వ్యవస్థలో గ్రామం ప్రాథమికమైన, ప్రధానమైన యూనిట్ గా ఉంది. సంప్రదాయబద్ధమైన సామాజిక, ఆర్థిక గ్రామీణ వ్యవస్థలో జజ్ మానీ విధానం ఒక మౌళిక లక్షణంగా ఉన్నది. వృత్తిపరంగా వైవిధ్యం కలిగిన ఏ సమాజంలో అయినా ఒక వృత్తిలో నిపుణుడైన వ్యక్తి ఇతర వృత్తులలో నిపుణులైన వారి నుండి వస్తువులను లేక సేవలను పొందే విధానం ఉండి తీరుతుంది. భారతదేశం దృష్టిలో ఉంచుకొన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధానాన్ని జజ్ మానీ విధానం అంటారు.

జజ్ మానీ విధానాన్ని పరిమితం చేసి, దానికి ఆ పేరును ఇచ్చిన మొదటి వ్యక్తి వైజర్. ఈ విధానంలో సేవలను పొందే వ్యక్తిని జజ్ మానీ అని, సేవలను అందించే వ్యక్తిని కామిన్ అని పిలుస్తారు. “హిందూ జజ్ మానీ విధానం” (1936) అనే తన గ్రంథంలో వైజర్ ఈ విధానాన్ని మొదటిసారి వివరించారు. ఈ గ్రంథాన్ని ఆయన ఉత్తరప్రదేశ్ లోని ఒక గ్రామం పరిశీలించిన తర్వాత రచించాడు. ప్రతి గ్రామంలో ప్రతికులం ఇతరులకు ఒక రకమైన సేవలను అందిస్తుందని ఆయన తెలియజేశాడు. ఈ విధంగా సేవలను అందించే విషయంలో ఒక గ్రామంలోని వివిధ కులాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ప్రతి కులం ఇతర కులాలకు సేవలను అందిస్తుంది. ప్రతి కులానికి సంప్రదాయం ప్రకారం ఏర్పాటైన సేవలను పొందే వ్యక్తులు ఉంటారు. ఈ పద్దతి తరతరాలుగా కొనసాగుతుంది. ఒకసారి ఈ విధమైన సంబంధం ఏర్పడితే, దానిని సులభంగా భంగపరచడానికి వీలుండదు. సేవలను అందించే వ్యక్తి తన హక్కులను మరొకరికి అమ్ముకోవచ్చును. సేవలను అందించే హక్కు వంశపారంపర్యగా లభిస్తుంది. కొన్ని సమయాల్లో ఇతరులకు బదలాయించడానికి వీలుగా ఉంటుంది. ఒక జజ్ మానీ తాను పొందే వస్తువులకు చెల్లింపు రేట్లను నిర్ణయిస్తాడు. 

భారతదేశపు గ్రామాలలో భూస్వాములైన ఉన్నత కులాలకు చెందిన జజ్ మానులకు వడ్రంగులు, కుమ్మరివారు, కమ్మరం చేసేవారు, రజకులు వంటి వివిధ నిమ్న కులాల వ్యక్తులు సేవలను అందించే పంపిణీ విధానమే జజ్ మానీ విధానమని కొలెండా (1963) నిర్వచించాడు. ఒక భారతీయ గ్రామంలో సాధారణంగా రైతులు, ఉన్నత కులాల వారు జజ్ మానులుగానూ, సేవలను అందించేవారు కామెన్లుగా వుంటారు. వ్యవసాయంపై ఆధారపడే భారతీయ గ్రామంలో వృత్తిపరంగా శ్రమ విభజనకు ఈ విధానం వివరిస్తుంది. అనేక విధాలైన సంబంధాలు, చెల్లింపుల పద్ధతిలో సేవలు, వస్తువుల విభజన జరుగుతుంది. సంప్రదాయం ఈ ఏర్పాటును ఆమోదిస్తుంది. పరస్పర విశ్వాసం, పరస్పరాధీనత అది కొనసాగడానికి తోడ్పడతాయి. 

జజ్ మాన్ అనే పదం యజమాన్ అనే సంస్కృత పదం నుండి ఏర్పడిందనీ, యజమాన్ అనగా యజ్ఞం వంటి క్రతువును నిర్వర్తించే వ్యక్తి అనీ, వర్మ (1977) అభిప్రాయం ప్రకటించాడు. వైదిక సాహిత్యంలో యజమాన్ అనే పదం తరచుగా కనిపిస్తుంది. ఆ సాహిత్యంలో అక్కడక్కడా యజమాన్ సౌభాగ్యం కోసం దైవాన్ని ప్రార్థించే పురోహితుని ప్రస్తావన కూడా కనిపిస్తుంది. ఈ పురోహితుడు ఆ కుటుంబానికి శాశ్వతమైన పౌరోహిత్య బాధ్యత వహిస్తాడు. కాలక్రమేణా అతని కుమారులు, మనుమలు ఆ కుటుంబంలో జజ్ మానీ హక్కును పొందుతారు. అందువల్ల జజ్ మాన్ సంక్షేమం కోసం కుటుంబ పురోహితుడు నిర్వహించే సంప్రదాయ క్రతువుల నుండి జజ్ మానీ విధానం ఏర్పడిందని అంటారు. క్షురకుడు, కుమ్మరి, కంసాలీ, వడ్రంగి, రజకుడు వంటి ఇతర కులాల వ్యక్తులు కూడా యజ్ఞం నిర్వహిచడంలో తోడ్పడతాయి. అందువల్ల వారికి వంశపారంపర్యమైన సేవలను అందించే హక్కు లభించింది. వ్యవసాయం ప్రాతిపదిక గల సామాజిక వ్యవస్థలో ఇదే విధమైన శ్రామికుల సరఫరా విధానం ఏర్పడింది. వ్యవసాయదారునికి ఉపయోగపడే మరికొన్ని కులాలు కూడా జజ్ మానీ హక్కులను, విధులను పొందడం జరిగింది. ఈ విధంగా జజ్ మానీ సంబంధాలు మతం కన్నా ఆర్థిక విషయాలపై ఎక్కువ ఆధారపడటం జరిగింది. కాని కొందరు సమాజ శాస్త్రజ్ణులు జజ్ మానీ సంబంధాలలో పవిత్రత, మైల విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వాస్తవానికి కులవ్యవస్థపై ఆధారపడిన భారత గ్రామీణ సమాజ వ్యవస్థలో జజ్ మానీ విధానం, ఆర్థిక, మత సంబంధమైన రెండు ధోరణులను ప్రదర్శిస్తుంది. 

ఈ విధానం అందించిన సేవలకు చేసే చెల్లింపుల కన్నా వివిధ వృత్తులను, అనుసరించే వ్యక్తులకు లభింపచేసే రాయితీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వీటిలో ఉచితంగా వసతి, భూమి, పశువులకి మేత లభింపజేయడం వంటి రాయితీలు చేరి ఉన్నాయి. ఈ రాయితీలు అందరికీ సమానంగా వర్తించవు. సంప్రదాయం ప్రకారం ఇవి మారుతూ ఉంటాయి. 

కుల ఏకస్వాముల సుస్థిరత కుటుంబ వారసత్వం వల్ల బలపడుతుంది. అనగా ఒక కుటుంబానికి సేవచేసే హక్కు వారసత్వంగా లభించేదిగానూ, విభజించడానికి వీలైనది గానూ ఉంటుంది. ఆ కుటుంబానికి నాగళ్ళు తయారుచేయడం లేక కుటుంబలోని పురుషులకు అప్పుడప్పుడు క్షురకర్మ చేయడం లేదా ఆ కుటుంబపు వస్త్రాలను శుభ్రం చేయడం మొదలైనవి ఈ హక్కులలో చేరి ఉంటాయి‌. ఇక క్షురకుని కుటుంబంలో సోదరులు విడిపోయినప్పుడు వారు అంతకు పూర్వం ఉమ్మడిగా సేవలను అందిస్తున్న కుటుంబాలను తమలో పంచుకుంటారు. సాధారణంగా వీరందరికీ చేసే సేవలకు ధన రూపంలో కాకుండా ధాన్య రూపంలో చెల్లింపులు జరుగుతాయి. గ్రామీణ ప్రాంతాలలో బహిరంగ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ లేనందువల్ల, పెట్టుబడిదారీ వ్యవస్థ ఉత్పత్తిలో యజమాని, ఉద్యోగి మధ్యవలె జజ్ మాన్, కామిన్ మధ్య సంబంధాలు లేకపోవడమే దీనికి కారణం.

కాని బీడల్ మన్ (1959) వంటి కొందరు రచయితలు బజమానీ విధానాన్ని ఒక ఫ్యూడల్ విధానంగా భావించారు. ఒకే ప్రాంతంలో నివసించే వివిధ కులాలకు చెందిన రెండు లేక అంతకంటే ఎక్కువ కుటుంబాల మధ్య వృత్తిపరమైన, కర్మకాండ సంబంధమైన విధులు, చెల్లింపులు వంశపారపర్యంగా లభించేటట్లు ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నదని వారు భావించారు. వర్ణవ్యవస్థలో అంతర్భాగాలు వున్న సాంఘిక, ఆర్థిక, మత సంబంధమైన వివిధ శ్రేణులు, ప్రత్యేకతలు ఈ విధానంలో ప్రతి ఫలిస్తాయి. కులం, కుటుంబం ఏర్పాటుచేసిన విధానానికి అనుగుణంగా నడుచుకోకపోతే ఈ విధానంలో సంఘర్షణ కలుగుతుంది. వివిధ రకాలైన వృత్తి సంబంధమైన కర్మకాండ సంబంధమైన అవసరాలు, విధులు లేకుండా వివిధ కులాల వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు ఏర్పడటానికి వీలుండదు. భూములు లేని కుటుంబాలు భూములు కలిగిన కుటుంబాలపై ఆధారపడటం, ఆ ప్రాంతంలోని ప్రజలందరికీ పంటను ఎంతోకొంత పంచిపెట్టడం వుంటాయి. కాబట్టి దీనిని ఫ్యూడల్ విధానంగా భావించాలి. ఈ విధానంలో సభ్యులు పరస్పర చర్యల ద్వారా అధికార సంబంధాలు వ్యక్తమౌతాయి. ఇటువంటి వ్యవస్థలో ఒక వ్యక్తి కలిగి ఉన్న హోదా రాజకీయ, ఆర్థిక, విషయాల వల్ల నిర్ణయింపబడుతుంది. ఈ విధానానికి కుల సంబంధమైన విధులు, భూమిపై యాజమాన్యం రెండు ప్రాతిపదికలుగా ఉన్నాయి. భూమిని కలిగి ఉన్న వారు, ఇతరుల నుండి సేవలను పొందుతారు. వారు మాత్రం ఇతరులకు సేవలు చేయరు. వారు జజ్ మాన్లు, కామిన్లు కాదు. ఉన్నత కులాలలో అతికొద్ది మాత్రమే ఇతరులకు సేవలను అందిస్తాయి. జజ్ మాన్ సంబంధాలతో సన్నిహితంగా వుండే సేవలు, చెల్లింపులు, ఉత్సవాలు కుల వ్యవస్థలో అంతర్భాగంగా వున్న అసమానత్వాన్ని బలపరచడానికి దోహదం చేస్తాయి. జజ్ మాన్ ఆర్థిక శక్తిని నిర్ణయించే రెండు ప్రధాన విషయాలు అతని కుటుంబ సభ్యుల సంఖ్య అధికంగా వుండడం, లేదా రాజకీయంగా ప్రాబల్యం కలిగి ఉండడం మరియు భూమిపై యాజమాన్యపు హక్కు జజ్ మాన్లతో పోల్చినప్పుడు కామిన్ల సంఖ్య తక్కువగా వుంటుంది. అందువల్ల ఈ విధానంలో అధికారం జజ్ మాన్లకు అవసరమైన సేవలను అందించి ఉంటుంది. దీనివలన కామినులు జజ్ మాన్లకు అవసరమైన సేవలను అందించడంపై జీవనాధారాన్ని కలిగి ఉంటారు. ఒక జజ్ మాన్ ఒక కామిన్ ను తొలగించినా, లేక అతని సేవలను నిరాకరించినా, ఆ కామిన్ పూర్తిగా శక్తి విహీనుడౌతాడు కాని సంప్రదాయబద్దంగా కుల సంఘాల జోక్యం చేసుకొని ఆ కామిన్ కు న్యాయం కలిగేలా చూస్తాయి.